: తెలంగాణ కోసం మొక్కిన మొక్కులు తీర్చుకుంటాం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కిన మొక్కులు తీర్చుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తిరుపతి వెంకన్నకు 5 కోట్ల రూపాయల కానుకలు చెల్లిస్తామని అన్నారు. అజ్మీర్ దర్గాకు కూడా 5 కోట్ల రూపాయల కానుకలు తానే స్వయంగా వెళ్లి సమర్పిస్తానని అన్నారు. విద్యార్థుల పట్ల సానుభూతితో పాత ఫీజు రీ యింబర్స్ మెంట్ విధానం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందు కోసం 862 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పాతబకాయిలు తీరుస్తామని ఆయన వివరించారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని తరలిస్తామని ఆయన తెలిపారు. 150 కోట్లతో కొత్త సచివాలయానికి కొత్త భవనాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నగరానికి గ్రేటర్ హోదా, కమీషనరేట్ హోదా కల్పిస్తామని ఆయన తెలిపారు. భూ క్రమబద్ధీకరణకు కొన్ని సవరణలు చేసినట్టు ఆయన వెల్లడించారు.