: బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న జయప్రద
అందాల నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీలో చేరే విషయమై కమలనాథులతో చర్చలు జరుపుతున్నట్టు ఆమె తెలిపారు. జయప్రద బీజేపీ వైపు చూస్తున్న విషయం ఎప్పటి నుంచో మీడియాలో వస్తోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ, పదవులు ఆశించి బీజేపీలో చేరడం లేదని, సాధారణ కార్యకర్తలానే పార్టీలోకి వస్తానని స్పష్టం చేశారు. కాగా, జయప్రద రాజకీయప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీతోనే. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1994లో ఆమె టీడీపీలో చేరారు. అనంతరం, 1996లో రాజ్యసభకు వెళ్లారు. పార్టీ 'తెలుగు మహిళ' విభాగానికి అధ్యక్షురాలిగానూ వ్యవహరించారు. అయితే, చంద్రబాబునాయుడితో విభేదాల కారణంగా టీడీపీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో, తన శ్రేయోభిలాషి అమర్ సింగ్ కు మద్దతుగా నిలిచి సమాజ్ వాదీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరపున బిజ్నోర్ స్థానంలో పోటీచేసి ఓటమిపాలయ్యారు.