: ఆల్ టైం రికార్డు నుంచి భారీ నష్టాల్లోకి!
భారత స్టాక్ మార్కెట్లో స్వల్పకాల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు ప్రయత్నించారు. దీంతో సెషన్ ఆరంభంలో సరికొత్త రికార్డుకు దూసుకెళ్లిన బెంచ్ మార్క్ సూచీలు ఆపై భారీ నష్టాల్లోకి దిగజారాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమతమ వాటాలను విక్రయానికి ఉంచారు. దీనికి తోడు కోల్ ఇండియా లిమిటెడ్ లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ ఉండటం కూడా మార్కెట్ నష్టాలకు దారితీసిందని నిపుణులు వ్యాఖ్యానించారు. పలువురు రిటైల్ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న వివిధ కంపెనీల వాటాలు అమ్మి, ఆ వెంటనే కోల్ ఇండియా షేర్లను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. కాగా, కోల్ ఇండియా ఆఫర్ విజయవంతం అయింది. మొత్తం 63,16,36,440 వాటాలను విక్రయానికి ఉంచగా, 66,20,45,720 వాటాల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 498.82 పాయింట్లు పడిపోయి 1.68 శాతం నష్టంతో 29,182.95 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 143.35 పాయింట్లు దిగజారి 1.60 శాతం నష్టంతో 8,808.90 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.