: గాల్లో ఎగిరే కార్ల తయారీలో టాటా మోటార్స్
గాల్లో ఎగిరే కార్లను తయారు చేయాలన్న లక్ష్యంతో సుమారు ఏడేళ్ల క్రితం లక్సెంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న మోటార్ డెవలప్ మెంట్ ఇంటర్నేషనల్ తో డీల్ కుదుర్చుకున్న టాటా మోటార్స్ ప్రయోగాలు కొనసాగిస్తోంది. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం అభివృద్ధిపై దృష్టి పెట్టిన సంస్థ గాల్లో ఎగిరే కారు తయారీపై కృషి చేస్తూనే ఉన్నామని టాటా మోటార్స్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ తిమోతి లెవర్టన్ తెలిపారు. "ఇదొక దీర్ఘకాలిక ప్రాజెక్ట్. చాలా కష్టంతో, ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. పెద్దఎత్తున పెట్టుబడి కావాలి. భవిష్యత్తులో దీన్ని విజయవంతం చేయగలమని భావిస్తున్నాం" అని ఆయన వివరించారు. కాగా, అందుబాటులోని సమాచారం మేరకు... గాల్లో ఎగిరే కారులో స్టీరింగ్ బదులు జాయ్ స్టిక్ ఉంటుంది. ఇంధనంగా కంప్రెస్ చేసిన ఎయిర్ ను వాడుతారు. ముగ్గురు పెద్దలు, ఒక చిన్నారి ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. స్పేస్ ఎయిర్ పాట్ ఆకారంలో ఉండే దీన్ని జూలై తరువాత ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావిస్తున్నారు.