: ఎమ్మెల్సీ సీటు అడగను... అడక్కుండానే అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిచ్చింది: పొన్నాల
ఎమ్మెల్సీ టికెట్ అంశంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, అడక్కుండానే తనకు అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టిందని చెప్పారు. ఎమ్మెల్సీ టికెట్టివ్వమని పార్టీ పెద్దలను తాను కోరబోనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలుపుతామన్నారు. ఎమ్మెల్యేల కోటాలో పార్టీకి దక్కనున్న ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. తాను మాత్రం సదరు స్థానాన్ని తనకివ్వమని కోరబోనని ఆయన చెప్పుకొచ్చారు. అంటే, ఎమ్మెల్సీ సీటును ఆయన అడగకున్నా, పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన విధంగానే, అధిష్ఠానమే కట్టబెట్టాలని ఆయన భావిస్తున్నారేమో. మరి ఆయన మనసులోని మాట అధిష్ఠానికి అర్థమవుతుందో, లేదో చూడాలి.