: విదేశాంగ శాఖ కార్యదర్శి మార్పుతో మోదీ, సుష్మాల మధ్య విబేధాలు?


భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మార్పు అంశం... కేంద్ర కేబినెట్ లో విభేదాలకు ఆజ్యం పోసిందా? అంటే, అవుననే అంటున్నాయి నిన్న వరుసగా చోటుచేసుకున్న సంఘటనలు. విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్ ను మొన్న రాత్రి తప్పించిన ప్రదాని నరేంద్ర మోదీ, మరుక్షణమే ఆ పదవిలో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న జైశంకర్ ను నియమించారు. ఈ పోస్టింగ్ తో జైశంకర్ పదవీకాలం మరో రెండేళ్లు పెరిగింది. విదేశాంగ మంత్రిగా ఉన్న తన నిర్ణయంతో సంబంధం లేకుండా విదేశాంగ కార్యదర్శిని ఎలా మారుస్తారంటూ సుష్మా స్వరాజ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పాల్గొనాల్సిన రెండు సభలకు ఆమె డుమ్మా కొట్టారు. అంతేగాక, సుజాతా సింగ్ ను తప్పించాలని గతంలోనే మోదీ యత్నించగా, సుష్మా అడ్డుకున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సుజాతా సింగ్ ఉన్నంత కాలం విదేశాంగ విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలపై పీఎంఓ నాన్చుడు ధోరణిని అవలంబించిందన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అయితే, వీటిన్నింటినీ కొట్టిపారేస్తూ, సుష్మా వివరణ ఇచ్చారు. విదేశాంగ శాఖ కార్యదర్శి మార్పు విషయాన్ని తానే సుజాతా సింగ్ కు చెప్పానని ఆమె నిన్న సాయంత్రం ప్రకటించారు. అయితే, ఎన్నికల ప్రచార సభలకు డుమ్మా కొట్టిన కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News