: జూనియర్ ఆర్టిస్టుపై సెక్స్ వర్కర్ల దాడి... గోపాలపురం పీఎస్ లో విధ్వంస కాండ!
సికింద్రాబాదులో రాత్రి సెక్స్ వర్కర్లు హల్ చల్ చేశారు. తాగిన మత్తులో జూనియర్ ఆర్టిస్టుపై మూకుమ్మడి దాడి చేశారు. సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో మొదలైన వీరి వీరంగం గోపాలపురం పోలీస్ స్టేషన్ లోనూ కొనసాగింది. వివరాల్లోకెళితే... జూనియర్ ఆర్టిస్ట్ గార్లపాటి శివకుమార్ గుంటూరు వెళ్లేందుకు సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నాడు. తనవద్దకు యాచనకు వచ్చిన ముగ్గురు సెక్స్ వర్కర్లకు అతడు చిల్లర వేశాడు. చిల్లర చూసిన సెక్స్ వర్కర్లు అతడిని నానా దుర్భాషలాడుతూ, అతడి జేబులో ఉన్న నగదును లాగేసుకునేందుకు యత్నించారు. దీంతో, అతడు పరుగులు పెట్టగా, వెంటపడిన ఆ మహిళలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శివకుమార్ తలకు తీవ్ర గాయమైంది. అక్కడి ప్రయాణికులు ఈ తతంగాన్నంతా ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడిపోగా, అటుగా వెళుతున్న గోపాలపురం పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనూ సదరు మహిళలు వీరంగం సృష్టించారు. స్టేషన్ లోని పూలకుండీలను పగులగొట్టడమే కాక అర్ధనగ్నంగా నృత్యాలు కూడా చేశారు. దీంతో కంగుతిన్న పోలీసులు, వారిని రెచ్చగొడుతున్న గ్యాంగ్ లీడర్ చాంద్ బాషాను అరెస్ట్ చేశారు.