: సొల్లు కబుర్లొద్దు... వాస్తవాలు మాట్లాడు: మోత్కుపల్లిపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం ఫైర్
తెలంగాణ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి, తన కులంపై టీ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎస్సీనని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి, వాస్తవానికి బీసీ అని టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించిన సంగతి తెలిసిందే. మోత్కుపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన శ్రీహరి, నిన్న ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై ఒంటికాలిపై లేచారు. ‘‘ నేను ఎస్సీనే. మాదిగను మాత్రం కాను. బైండ్ల కులస్తుడిని. ఎస్సీ కేటగిరీ కింద రాష్ట్రపతి గుర్తించిన 56 కులాల్లో మాది కూడా ఒకటి. బడిలో చేరినప్పుడు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు... ప్రతిసారీ బైండ్ల కులస్తుడిగానే రాసుకున్నా. ఇందులో పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే, జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. హైకోర్టులో కేసు వేయండి. అనర్హత వేటు వేయించండి. అంతే తప్ప సొల్లు మాట్లాడొద్దు. దిగజారుడుతనంతో హీనమైన విమర్శలు చేయొద్దు. మా అమ్మ చాలా బాధపడింది. రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడతారా? అని కూడా మా అమ్మ అడిగింది. అందుకే స్పందిస్తున్నా. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే మీడియా సమావేశం పెట్టా’’ అని ఆయన అన్నారు.