: రాజయ్య బర్తరఫ్ తర్వాత నేడు టీ కేబినెట్ భేటీ... తాజా పరిణామాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్న నేటి కేబినెట్ భేటీకి ఓ ప్రత్యేకత ఉంది. నిన్నటిదాకా డిప్యూటీ సీఎంగా ఉన్న తాటికొండ రాజయ్య స్థానంలో పదవీ బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి, తొలిసారి కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన కడియంకు కేబినెట్ భేటీలు కొత్త కాకున్నా, ఎంపీగా ఉన్న ఆయన ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి కేబినెట్ భేటీకి హాజరవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఓ మంత్రి బర్తరఫ్ తర్వాత జరుగుతున్న ఈ భేటీ... రాజయ్య బర్తరఫ్ కు దారి తీసిన కారణాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న మార్పులు, చేర్పులపై కాస్త లోతుగానే చర్చించే అవకాశాలున్నాయి. ఇక ప్రభుత్వ విధాన నిర్ణయాల విషయానికొస్తే... కొత్త పారిశ్రామిక విధానం, ఏపీతో నదీ జలాల వివాదం తదితర అంశాలపై నేటీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.