: బీజేపీపై ఉండవల్లి విమర్శనాస్త్రాలు
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా రోజుల తరువాత మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో వెంకయ్యనాయుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారని, ఇవాళ ప్రత్యేక హోదాను మరొక రూపంలో ఇస్తామనడం సరికాదని ఉండవల్లి అన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆ హోదా ఇస్తామని చెప్పిందని, ఆ మేరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదని చెప్పారు. ఆ రాష్ట్రాలను విడగొట్టలేదు కదా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టడంవల్ల ప్రజల్లో కోపం, బాధ ఇంకా తగ్గలేదని గుర్తు చేశారు.