: కేజ్రీవాల్ ధాటికి బీజేపీ భయపడుతోందా?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను చూసి బీజేపీ భయపడుతోందా? అంటే, అవుననే సమాధానం వినపడుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రముఖ నేతలను మట్టికరపించిన మోదీ మేనియా ఢిల్లీలో పనిచేస్తున్నట్టు కనపడడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి 120 మంది ఎంపీలను బరిలోకి దించుతామని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీంతో, బీజేపీపై విమర్శలు చెలరేగాయి. ఒక్క కేజ్రీవాల్ ను ఎదుర్కొనేందుకు 120 మంది ఎంపీలా? అంటూ ఆమ్ ఆద్మీ విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో, బీజేపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఎంపీలు కూడా పార్టీ కార్యకర్తలేనని, అయితే, 120 మంది ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం రావడం లేదని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వివరణ ఇచ్చారు.