: ఆఫ్రికాను ఎబోలా, భారత్ ను స్వైన్ ఫ్లూ వణికిస్తున్నాయి!
ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తుండగా, భారత్ ను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. శీతాకాలం ముగుస్తుండగా తెలంగాణలో ప్రారంభమైన స్వైన్ ఫ్లూ, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కు విస్తరించింది. అటు, రాజస్థాన్ లోనూ స్వైన్ ఫ్లూ బయటపడింది. మరిన్ని రాష్ట్రాలకు స్వైన్ ఫ్లూ విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009లో మహారాష్ట్రను వణికించిన స్వైన్ ఫ్లూ చాలా కాలం తరువాత భారత్ లో ప్రభావం చూపుతుండడం పౌరులను భయాందోళనలకు గురి చేస్తోంది. తెలంగాణలో వందల సంఖ్యలో ప్రజలు స్వైన్ ఫ్లూ బారిన పడగా, పదుల సంఖ్యలో రోగులు మరణించారు. ఏపీలో స్వైన్ ఫ్లూ బారినపడిన వారు పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరారు. రాజస్థాన్ లో 145 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, కొంత మంది మృత్యువుతో పోరాడుతున్నారు. దీంతో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్యశాఖా మంత్రులు అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు.