: మిర్యాలగూడలో ఐటీ అధికారులు... రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలవరం
ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిపిన సోదాలు రియల్ ఎస్టేట్ వర్గాల్లో కలకలం రేపాయి. ఆదాయపన్ను శాఖకు చెందిన తొమ్మిది మంది అధికారుల బృందం పట్టణంలోని పలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఈ కార్యాలయాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందినవి కావడంతో ఆ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు బడా సంస్థల్లో కలవరం మొదలైంది. ఉదయం నుంచి రాత్రి దాకా సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని శరణ్య గ్రీన్ హోం, భవ్య కన్‌స్ట్రక్షన్, కృష్ణమానస కన్‌స్ట్రక్షన్లతో పాటు స్ఫూర్తి చిట్‌ఫండ్స్‌లలో కూడా సోదాలు జరిగాయి. అంతేకాక సదరు సంస్థల అధినేతలు మారుతీరావు, శ్రవణ్, కిషోర్ రెడ్డిలను అధికారులు ప్రశ్నించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంగానే ఈ ముగ్గురు బిల్డర్లకు చెందిన కార్యాలయాల్లో సోదాలు జరిగాయని తెలుస్తోంది.