: 'లింగా' నష్టం చెల్లించేందుకు రాక్ లైన్ వెంకటేష్ సిద్ధం


'లింగా' సినిమా నష్టాన్ని భరించేందుకు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సంసిద్ధత వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'లింగా' సినిమాకు ఫ్యాన్సీ రేటు చెల్లించి డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు చవిచూశారు. దీంతో వారు సినిమా విడుదలైన వారం రోజులకే నష్టాలు వచ్చాయని, రజనీ జోక్యం చేసుకుని నష్టాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించడం ప్రారంభించారు. దీంతో మీడియా ముందుకు వచ్చిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్ల తీరు సరికాదని, సమస్య ఏదైనా ఉంటే తనను సంప్రదించాలి కానీ ఆందోళనకు దిగడం ఏంటని నిలదీశారు. అయినప్పటికీ వారు దిగి రాకుండా రజనీ జోక్యం పదేపదే కోరడంతో పాటు, ఆందోళనను ఉద్ధృతం చేశారు. దీంతో వారి నష్టాన్ని చెల్లించేందుకు 'లింగా' సినీ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ముందుకు వచ్చారు. దీంతో 'లింగా' డిస్ట్రిబ్యూటర్లు తమకు జరిగిన నష్టం లెక్కల వివరాలను నిర్మాతకు అందజేశారు. మరో మూడు రోజుల్లో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ నష్టంలో కొంత భాగాన్ని రజనీ చెల్లిస్తారని తెలుస్తోంది. గతంలో 'బాబా' సినిమా సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ల నష్టాన్ని రజనీ పూర్తిగా భర్తీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News