: ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో అత్యధిక లాభాన్ని నమోదు చేసిన యాపిల్
ఐ-ఫోన్ పేరిట స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న యాపిల్ డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో అత్యధిక లాభాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం 74.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.58 లక్షల కోట్లు)గా నమోదైంది. ఈ ఫలితాలను వాల్ స్ట్రీట్ పండితులు సైతం ఊహించలేకపోయారు. గత సంవత్సరం ఇదే సమయంలో 57.6 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ ఆదాయం ఈ ఏడు ప్రపంచవ్యాప్తంగా 7.45 కోట్ల ఐ-ఫోన్ 6 లను విక్రయించడంతో గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది. దీంతో, సంస్థ నికర లాభం ఆకాశాన్ని తాకింది. కార్పొరేట్ చరిత్రలో ఇంతవరకూ ఎవరూ నమోదు చేయనంతగా 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.10 లక్షల కోట్లు) నెట్ ప్రాఫిట్ సాధించింది. ప్రస్తుతం యాపిల్ వద్ద మొత్తం 178 బిలియన్ డాలర్ల మిగులు నిధులు ఉన్నాయి. వీటితో ఐబీఎం సంస్థను సులువుగా కొనుగోలు చేయవచ్చు, లేదా, ఒక్కో అమెరికన్ కు 556 డాలర్ల (రూ.34,171) చొప్పున పంచవచ్చని ఎస్ అండ్ పీ విశ్లేషకుడు హోవార్డ్ సిల్వర్ బ్లాట్ తెలిపారు. ఈ ఫలితాలు తమకు అత్యంత సంతృప్తిని కలిగిస్తున్నాయని, తమ తదుపరి ప్రొడక్ట్ గా 'యాపిల్ వాచ్'ని ఏప్రిల్ లో విడుదల చేస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. ఇదిలావుండగా, సంస్థ ఆర్థిక ఫలితాలు వెల్లడైన తరువాత అమెరికా మార్కెట్లో యాపిల్ ఈక్విటీ వాటా విలువ 5 శాతం పెరిగి 114.90 డాలర్లకు చేరింది.