: రాజధాని ప్రాంత రైతులకు నిరాశ... ‘పూలింగ్’ భూముల్లో సాగు కుదరదన్న సర్కారు
నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని రైతులకు సర్కారు కాస్త నిరాశ కలిగించే ప్రకటన చేసింది! రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో ఇకపై సాగు కుదరదని ఏపీ సర్కారు తేల్చి చెప్పింది. రెండో పంట వేయరాదని స్పష్టం చేసింది. విజయవాడలో కొద్దిసేపటి క్రితం సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా సర్కారు నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఏడు వేల ఎకరాల మేర భూములను సేకరించామని చెప్పిన ఆయన, నెలాఖరు నాటికి 10 వేల ఎకరాలను సేకరించనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఇకపై రైతులు పంటలను సాగు చేయడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, రాజధాని నిర్మాణం కోసం కృష్ణా కరకట్ట భూముల సేకరణకూ నోటిఫికేషన్ జారీ చేశామని ఆయన చెప్పారు.