: సర్వం కోల్పోయాం: ‘చాగల్లు’ దుర్ఘటనలో కొత్త జంట ఆవేదన... బాసటగా నిలిచిన బాటసారులు!
ప్రకాశం జిల్లా చాగల్లు సమీపంలో చోటుచేసుకున్న వోల్వో బస్సు ప్రమాదంలో సర్వస్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఓ కొత్త జంట... తెలుగు న్యూస్ చానెళ్లతో ఫోన్ లో మాట్లాడుతూ తమ దీన స్థితిని వెల్లడించారు. ఇటీవలే పెళ్లైన తాను భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లివస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కొత్త పెళ్లికూతురు వాపోయింది. ప్రమాదంలో బంగారు నగలు, భర్త సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయని ఆమె పేర్కొంది. కాళ్లకు చెప్పులు, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో నడిరోడ్డుపై నిలబడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత అర్ధరాత్రి వేళ గంటల తరబడి పోలీసుల కోసం వేచిచూడాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. చాగల్లులో మంటలకు బుగ్గి అయిన బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరిలో చాలామందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ప్రమాదం నేపథ్యంలో నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో నిలబడ్డ బాధితులకు అటుగా వెళుతున్న బాటసారులు చేయూతనందించారు. తమ వాహనాల్లో బాధితులను ఎక్కించుకుని నెల్లూరుకు చేర్చారు.