: మా పిల్లలకు భారత్ అన్నా, గాంధీ అన్నా అమితాసక్తి: 'మన్ కీ బాత్'లో అమెరికా అధ్యక్షుడు ఒబామా
ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశమన్నా, భారత స్వాతంత్ర్య సంగ్రామమన్నా, మహాత్మా గాంధీ అన్నా తన పిల్లలకు అమితాసక్తి అని ఆయన తెలిపారు. తమ కూతుళ్లు మాలియా, సాషాలు భారత్ రావాలనుకున్నారని, అయితే స్కూల్ ఉండటం వల్లే రాలేకపోయారని అన్నారు. ఈసారి భారత పర్యటనకు వస్తే, తన ఇద్దరు కూతుళ్లతో కలిసే వస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే అప్పటిలోగా తాను అధ్యక్షుడి హోదాలో ఉండకపోవచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒబామా వ్యాఖ్యలకు స్పందించిన మోదీ... అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నా, లేకున్నా ఒబామాకు ఎల్లప్పుడూ ఘన స్వాగతం పలుకుతామని వెల్లడించారు. సోమవారం రికార్డ్ చేసిన మోదీ, ఒబామాల ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిన్న రాత్రి 8 గంటలకు ప్రసారమైంది.