: మనం ఒబామాను పిలిస్తే, వాళ్లు పుతిన్ ను ఆహ్వానిస్తున్నారు!


భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను పిలవగా, ఆయన మూడు రోజుల పాటు పర్యటించి ఈ మధ్యాహ్నం సౌదీ వెళ్లారు. రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా భారత్ తన ఆయుధ సంపత్తిని ఒబామా సాక్షిగా ప్రపంచానికి ప్రదర్శించింది. అయితే, భారత్ కు పోటీగా చైనా కూడా భారీ ఎత్తున సైనిక పాటవాన్ని ప్రదర్శించాలని నిర్ణయించింది. అందుకు ముఖ్య అతిథిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఆహ్వానించాలని చైనా వర్గాలు భావిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ విజయాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మిలిటరీ పెరేడ్ నిర్వహిస్తున్నారు. దీనికి రష్యా నేతలు వస్తున్నారని చైనా విదేశాంగ శాఖ నిర్ధారించింది. చైనా సైనిక ప్రదర్శనకు విదేశీ నేతలు హాజరుకానుండడం ఇదే ప్రథమం. చైనా 1949 నుంచి ప్రతి పదేళ్లకోసారి మిలిటరీ పెరేడ్ నిర్వహిస్తూ వస్తోంది. చివరిసారిగా 2009లో పెరేడ్ నిర్వహించగా, ప్రపంచ పరిణామాల నేపథ్యంలో, చైనా ఈసారి కాస్త ముందుగానే ప్రదర్శనకు సిద్ధమైనట్టు అర్థమవుతోంది. ఈ భారీ ఆయుధ ప్రదర్శన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్టు బీజింగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ ఫు ఝెన్ ఘువా తెలిపారు.

  • Loading...

More Telugu News