: మోదీపై రాహుల్ వ్యాఖ్యలు ఈర్ష్యతో కూడుకున్నవి: వెంకయ్యనాయుడు
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అనుచితమని, ఈర్ష్యతో కూడుకున్నవని, అపరిపక్వమైనవని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చవకబారు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని వెంకయ్య ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎంతదూరమైందో కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వం ధరలను అదుపులోకి తెచ్చిందని చెప్పుకొచ్చారు. దేశంలో వృద్ధి రేటు పెరిగిందని, పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. దేశాభివృద్ధికి వాజ్ పేయి పునాదులు వేశారని తెలిపారు. ఇక, స్మార్ట్ సిటీల అంశంపై మాట్లాడుతూ... టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. టాస్క్ ఫోర్స్ లో కేంద్రం, రాష్ట్రం, అమెరికా నుంచి ముగ్గురేసి సభ్యులు ఉంటారని, మార్చిలోగా టాస్క్ ఫోర్స్ నివేదిక ఇస్తుందని వివరించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.