: ఒబామా అండగా దూకిన 'బుల్'... సరికొత్త రికార్డుకు స్టాక్ మార్కెట్
రెట్టించిన ఉత్సాహంతో మార్కెట్ బుల్ రంకెలేసింది. ఒక వైపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తుంటే... మరోవైపు స్టాక్ మార్కెట్లో కొత్త కొనుగోళ్లు వెల్లువెత్తాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కోట్ల కొద్దీ డబ్బును భారత కంపెనీల్లో పెట్టేందుకు పోటీ పడ్డారు. దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ట్రేడింగ్ లో సందడి చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల మధ్య సెన్సెక్స్ సూచిక 200 పాయింట్లకు పైగా పెరిగింది. మార్కెట్లో లిస్టింగ్ అవుతున్న కంపెనీల విలువ రూ.50 వేల కోట్లకు పైగా పెరిగింది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 292.20 పాయింట్లు పెరిగి 1 శాతం లాభంతో 29,571.04 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచి 74.90 పాయింట్లు పెరిగి 0.85 శాతం లాభంతో 8,910.50 పాయింట్ల వద్దా కొనసాగాయి. భారత స్టాక్ మార్కెట్ సూచీల ముగింపులో ఇది సరికొత్త రికార్డు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెక్టార్లు అర శాతం పైగా లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఐసీఐసీఐ, ఐటీసీ, హెచ్ డీఎఫ్ సీ, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, మారుతి సుజుకి తదితర కంపెనీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టపోయాయి.