: దావోస్ లో ఏ ఇద్దరు కలిసినా భారత్ గురించే మాట్లాడుకుంటున్నారు: చంద్రబాబు
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటన సంతృప్తికరంగానే సాగిందని అన్నారు. పెట్టుబడుల కోసమే దావోస్ వెళ్లామని తెలిపారు. దావోస్ సదస్సు సందర్భంగా ఏ ఇద్దరు కలిసినా భారత్ గురించే మాట్లాడుకుంటున్నారని వివరించారు. ప్రపంచం మొత్తం భారత్ ను ప్రత్యేకంగా చూస్తోందని అన్నారు. మనదేశం పట్ల పెట్టుబడిదారులు సానుకూల దృష్టితో ఉన్నారని స్పష్టం చేశారు. భారత్ నెక్స్ట్ డికేడ్ అని వాళ్లంటున్నారు, భారత్ నెక్స్ట్ సెంచరీ అని నేనంటున్నానని ఉద్ఘాటించారు. సహజ వనరులు, స్థిరమైన ప్రభుత్వం అంతర్జాతీయంగా మనకున్న ప్రధాన ఆకర్షణ అని చంద్రబాబు. రాష్ట్రం గురించి మాట్లాడుతూ, ఏపీ త్వరలో గేట్ ఆఫ్ ఇండియా అవుతుందని అన్నారు. ఏపీకి బ్రాండింగ్ కోసమే దావోస్ పర్యటన సాగిందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ తోనూ మాట్లాడానని తెలిపారు. రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ 5 అంశాల్లో సహకరిస్తామని తెలిపిందని బాబు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, డ్రాక్రా ఉత్పాదనలనకు వాల్ మార్ట్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఇవ్వనుందని వివరించారు. అంతేగాక, ఏపీలో ఇన్ఫోసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరామని, వారు సుముఖంగానే ఉన్నారని తెలిపారు. దావోస్ లో మొత్తం 35 సమావేశాల్లో పాల్గొన్నానని, గూగుల్, వాల్ మార్ట్, లూయీ సంస్థల ప్రతినిధులతో మాట్లాడానని వివరించారు. హిందూజా, టాటా, హీరో తదితర కార్పొరేట్లతోనూ ఏపీలో పెట్టుబడులపై చర్చించానన్నారు. శ్రీసిటీలో పెప్సీకో యూనిట్ నెలకొల్పనున్నారని, హిందూపురంలో సంతూర్ యూనిట్ స్థాపించనున్నారని తెలిపారు. పెప్సీకో తన నూతన నేచురల్ ఫుడ్ డ్రింక్ తయారీకి ఉద్యాన పంటలను కొనుగోలు చేయనుందని చెప్పారు. విప్రోతో కలిసి ఈ-గవర్నెన్స్ లో జాయింట్ వెంచర్ కు రూపకల్పన చేశామని వివరించారు. ఇక, హీరో గ్రూపు ఏడాదిలో శ్రీసిటీలో ప్రాజెక్టును పూర్తిచేస్తుందన్నారు.