: ‘తెలంగాణ’ మొక్కు తీర్చుకుంటున్న చేవెళ్ల ఎమ్మెల్యే... కాలినడకన తిరుమలకు పయనం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే, తిరుమలకు కాలినడకన వస్తానన్న మొక్కును రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తీర్చుకుంటున్నారు. సోమవారం నవాబ్ పేట మండలంలోని తన స్వగ్రామం చింతలపేట నుంచి ఆయన తిరుమలకు కాలినడకన బయల్దేరారు. నేటి ఉదయం నియోజకవర్గ కేంద్రం చేవెళ్లకు చేరుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలని ఆయన చేవెళ్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరారు. కాలినడకన చేవెళ్లకు చేరుకున్న యాదయ్యకు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.