: మంథని అడవుల్లో మావోయిస్టుల అలికిడి... కొనసాగుతున్న పోలీసుల కూంబింగ్
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. జిల్లా పరిధిలోని మంథని సమీపంలోని అడవుల్లో మావోలు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. రాత్రి నుంచి పోలీసులు అక్కడి అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, తెలంగాణలో మావోల సంచారం నానాటికీ పెరుగుతోంది. నిన్నటికి నిన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ మావోల పోస్టర్లు కలకలం రేపాయి. భారత్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను నిరసిస్తూ తాము పిలుపునిచ్చిన బంద్ కు సహకరించాలని సదరు పోస్టర్లలో మావోలు ప్రజలను కోరారు.