: ఏపీ మంత్రి రాక కోసం... అరగంట పాటు నిలిచిన ప్రశాంతి ఎక్స్ ప్రెస్
ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాక కోసం ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏకంగా అరగంట పాటు నిలిచిపోయింది. కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళితే... కడప జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పల్లె, శనివారం నంద్యాలలోని సాయి గురురాఘవేంద్ర సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించాల్సి ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి పల్లె నంద్యాలకు బయలుదేరారు కూడా. అయితే స్థానికంగా ఉన్న తనను ఆహ్వానించని సదరు ఉత్సవాలను మంత్రి ఎలా ప్రారంభిస్తారంటూ టీడీపీ నేత ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. అధిష్ఠానం ఆదేశాలతో సదరు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న మంత్రి, నంద్యాల నుంచి విజయవాడ వెళతానంటూ రెవెన్యూ అధికారులకు సమాచారమందించారట. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు నంద్యాల చేరుకున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ను రైల్వే స్టేషన్ లో అరగంటకు పైగా నిలిపేశారు.