: ఇంజినీర్ల సమస్య పరిష్కారానికి ఇద్దరు సీఎంలకు లేఖలు: వైఎస్ జగన్
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న ఇంజినీర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణలోని 5, 6 జోన్లలో ఇంజినీర్లుగా ఎంపికైన ఆంధ్రా ప్రాంతం అధికారులు రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజినీర్ల ప్రతినిధి బృందం నిన్న జగన్ ను కలిసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూ లేఖ రాస్తానని ఇంజినీర్లకు హామీ ఇచ్చారు. అంతేకాక తమ పార్టీ నేతలు ఇంజినీర్లను వెంటబెట్టుకుని గవర్నర్ ను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు.