: ప్రేమకు ఎల్లలుండవన్న విషయం మరోసారి నిరూపితమైంది!
ప్రేమ గుడ్డిదని, దానికి ఎల్లలుండవని, కులమత భేదాలను పట్టించుకోదని ప్రతీతి! ఆ విషయం మరోసారి నిరూపితమైంది. అయితే, ఇంతకుముందు ఎన్నో గాథలు! కొన్ని విషాదాంతం కాగా, మరికొన్ని సుఖాంతమయ్యాయి. తాజాగా, తెలుగు అబ్బాయి, శ్రీలంక అమ్మాయి కూడా ప్రేమ నేపథ్యంలో హద్దులను చెరిపేశారు. వీరి కథకు మాత్రం శుభం కార్డే పడింది. వివరాల్లోకెళితే... నిజామాబాద్ జిల్లా మచ్చారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ ఉపాధి కోసం గల్ఫ్ బాటపట్టాడు. దుబాయ్ లో ఓ కారు డ్రైవర్ గా పనిలో కుదిరాడు. ఇక, శ్రీలంకకు చెందిన ఉషాని చారుక దుబాయ్ లోనే ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ వ్యవహారాన్ని అట్టే నాన్చకుండా రవీందర్ వెంటనే తన తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పెద్దమనసుతో అంగీకరించారు. అటు, లంక యువతి ఉషాని కుటుంబం కూడా పెళ్లికి అడ్డుచెప్పలేదు. దీంతో, రవీందర్ తో ఆమె వివాహం సోమవారం వేడుకగా జరిగింది. ఇరువురి బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.