: భారత విమానాశ్రయాల్లో అమెరికా విమానాలను చూడాలనుకుంటున్నా: ఒబామా
తమ దేశంలో తయారైన వస్తువులను భారత్ లో చూడాలని ఆకాంక్షిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత్-అమెరికా సీఈఓల సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విమానాశ్రయాల్లో అమెరికా తయారీ విమానాలను చూడాలనుకుంటున్నట్టు తెలిపారు. అమెరికా తయారీ టర్బైన్లతో భారత్ లో ఇంధన వనరుల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అమెరికా దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చేవి 2 శాతం మాత్రమేనని, అదే సమయంలో భారత్ దిగుమతుల్లో అమెరికా నుంచి వచ్చేవి ఒక్క శాతం మాత్రమేనని వివరించారు. ఇరు దేశాల మధ్య పరస్పర దిగుమతులు పెరగాలని, అందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య పెట్టుబడుల వృద్ధి లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. మేడిన్ అమెరికా వస్తువులు భారత్ కు దిగుమతి అవడం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. భారత్, అమెరికాల గమనం సవ్యదిశలోనే సాగుతోందన్నారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందాలి, సమృద్ధి సాధించాలని ఒబామా ఆకాంక్షించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొత్త ప్రపంచానికి మార్గదర్శకాలవుతాయని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి ఇరుదేశాలను కొత్త పంథాలో నడిపిస్తుందని అన్నారు. రెండు దేశాలకు మధ్య పెరుగుతున్న వాణిజ్య బంధం భారత విజయాలకు సూచిక అని కొనియాడారు. భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక సంబంధాలు రెండు దేశాల సమాజాలను మరింత దగ్గర చేస్తాయని విశ్లేషించారు. ఒబామా, గణతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఈ సీఈఓల సదస్సులో ప్రస్తావించారు. భారత గణతంత్ర వేడుకలు తనను అబ్బురపరిచాయని తెలిపారు. ఈ వేడుకలు భారత్ సత్తాని ప్రపంచానికి చాటాయని కితాబిచ్చారు.