: మిస్ కొలంబియాకు 'మిస్ యూనివర్స్' కిరీటం
'మిస్ యూనివర్స్-2014' కిరీటాన్ని 'మిస్ కొలంబియా' పౌలినా వేగా దక్కించుకుంది. అమెరికాలోని మయామిలో డోరాల్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలో 83 మంది అందాలభామలు పాల్గొన్నారు. వారిలో మిస్ యూఎస్ ఏ, మిస్ నెదర్లాండ్స్, మిన్ ఉక్రెయిన్, మిస్ జమైకా, మిస్ కొలంబియాకు చెందిన ముద్దుగుమ్మలు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. వారిలో మిగతా నలుగురినీ కాదని మిస్ యూనివర్స్ టైటిల్ ను కొలంబియా భామ పౌలినా వేగా ఎగరేసుకుపోయింది. మిస్ యూఎస్ఏ నియా సాంచెజ్ తొలి రన్నరప్ గా, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కుషావాస్ రెండవ రన్నరప్ గా నిలిచారు. భారత్ నుంచి ఈ పోటీలో పాల్గొన్న నయోనితా లోధ్ తొలి 15 మంది పోటీదారుల్లో మాత్రమే నిలిచింది. కాగా, 'బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్' విభాగంలో టాప్-5 లో లోధ్ చోటు దక్కించుకుంది. ఈ ఏడాది యూనివర్స్ పోటీల్లో కొత్త ఫార్మాట్ ను ప్రవేశపెట్టారు. ఫేస్ బుక్ అభిమానులు అడిగిన కొన్నివేల ప్రశ్నల్లో ఎంపిక చేసిన ఓ ప్రశ్నకు తొలి ఐదుగురు కంటెస్టెంట్ లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.