: తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడినవే: గవర్నర్
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎందరో త్యాగాల ఫలంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందడానికి అందరి సహకారం అవసరమన్నారు. రాజకీయ అవితీని పూర్తిగా అరికడతామని తెలిపారు. హైదరాబాదు నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎక్స్ ప్రెస్ హైవేలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు. కేజీ నుంచి పీజీ విద్యను అమలు చేస్తామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్ రూం పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని నరసింహన్ పేర్కొన్నారు.