: అలరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలు
సంక్రాంతి సంబరాల థీమ్ తో గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శకటం అందరినీ అలరించింది. సంక్రాంతి సందడినంతా చూపుతూ రాజ్ పథ్ రహదారిపై సంబరాల రంగవల్లులు అద్దిన ఏపీ శకటం కనిపించగానే పలువురు కేంద్ర మంత్రులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతించారు. పరికిణీలు కట్టుకొని ముగ్గుల చుట్టూ ఆడుతున్న అమ్మాయిలు, హరిదాసు, గంగిరెద్దు తదితరాలను ఈ శకటంపై తీర్చిదిద్దారు. అసోం, మధ్యప్రదేశ్, గోవా తదితర రాష్ట్రాల శకటాలు సైతం అందరినీ ఆకట్టుకున్నాయి. బోనాల కాన్సెప్టుతో వచ్చిన తెలంగాణ శకటం సైతం అందరి చూపులనూ తనవైపు తిప్పుకుంది. శకటం ముందు అమర్చిన పోతురాజు ప్రతిమ, ఆ వెనుక బోనాలు ఎత్తుకున్న మహిళలు, పూనకాలు... ఇలా తెలంగాణ శకటం రాజ్ పథ్ లో సాగింది.