: పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించిన సల్మాన్ ఖాన్ తండ్రి
భారత ప్రభుత్వం ప్రకటించిన 'పద్మశ్రీ' పురస్కారాన్ని స్వీకరించేందుకు బాలీవుడ్ రచయిత, సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తిరస్కరించారు. తన హోదాకు, చేస్తున్న పనికి సరిపోలదని అన్నారు. "చాలా ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నన్ను నిర్లక్ష్యం చేసింది. సినీ పరిశ్రమలో నా సహచరులు, నాకన్నా జూనియర్ లను 'పద్మ' పురస్కారంతో గౌరవించింది. 'పద్మ' అవార్డుల జాబితాలో నా పేరు ఉందని మూడు రోజుల కిందట నాకు తెలిసింది. అప్పుడే అనుకున్నా నేను పొందాల్సిన దాన్ని ఎట్టకేలకు సాధించానని. కానీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నన్ను 'పద్మశ్రీ'కి ఎంపిక చేసిందని తెలియగానే అది నాకు తగింది కాదని భావించాను" అని 79 ఏళ్ల సలీమ్ ఈ మేరకు స్పందించారు. అయితే, తనను గుర్తించి అవార్డు ప్రకటించినందుకుగానూ ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం తనను పక్కనబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న హోదాకు 'పద్మశ్రీ' ఆలస్యంగా వస్తే ఎవరైనా స్వీకరిస్తారా చెప్పండి? అని సలీమ్ ప్రశ్నిస్తున్నారు.