: ఐకమత్యమే భారత్ బలం: ప్రణబ్
ఐకమత్యమే భారత్ బలమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టారని అన్నారు. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం ప్రజాస్వామ్యానికి పరీక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించి, మహిళా సాధికారతను గుర్తిస్తే ఏ దేశమైన అగ్రదేశంగా రూపొందుతుందని ఆయన తెలిపారు. ప్రపంచానికి, దేశానికి ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని ఆయన చెప్పారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు మార్గదర్శి అని ఆయన స్పష్టం చేశారు. గాంధీజీ తత్వం ప్రపంచానికి ఆదర్శమని ఆయన స్పూర్తి నింపారు. దేశ విముక్తికి పోరాడిన అసంఖ్యాక యోధులకు ధన్యవాదాలని ఆయన అన్నారు. దేశ ప్రజలందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలని ఆయన తెలిపారు.