: మేరా ప్యారా భారత్ మహాన్, నమస్తే: ఒబామా
మేరా ప్యారా భారత్ మహాన్ నమస్తే అని ఒబామా భారతీయుల్ని పలకరించారు. మోడీతో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత గణతంత్రవేడుకల ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలని అన్నారు. గణతంత్రవేడుకలకు హాజరైన తొలి అధ్యక్షుడు, రెండుసార్లు భారత్ వచ్చిన తొలి అధ్యక్షుడు తానేనని ఆయన పేర్కొన్నారు. భారతీయుల ఆత్మీయత తనను కట్టిపడేశాయని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని ఆయన అన్నారు. మోదీ ప్రసంగం బాలీవుడ్ హీరోను తలపించిందని ఆయన చెప్పారు. పౌర అణు ఒప్పందం, పెట్టుబడులపై రెండు ఒప్పందాలు చేసుకున్నామని ఒబామా వెల్లడించారు. సౌరశక్తి వినియోగం, వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం అరికట్టడం వంటి అంశాలపై రెండు దేశాల భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా రక్షణ సహకారం మరో పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగుతుందని, ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్రంలో పరస్పర సహకారంతో రెండు దేశాలు భద్రతను కాపాడుతాయని ఆయన వివరించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. న్యూయార్క్ లో మోదీ ప్రసంగం మరువలేమని ఆయన తెలిపారు. రేపటి వేడుకల కోసం తాను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. పేదరిక నిర్మూలనకు అమెరికా సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.