: ఒబామా గారూ, ధన్యవాదాలు: మోదీ
మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలని ప్రధాని మోదీ తెలిపారు. ఒబామా మోదీ సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శాంతి, రక్షణ, వాణిజ్యం వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొనాలని, సహాయ సహకారాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. గత కొంత కాలంగా అమెరికాతో ఉత్సాహభరితమైన బంధాన్ని, మరిన్ని రంగాలకు విస్తరించి బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. వాణిజ్య ఒప్పందాలు అంతర్జాతీయ, జాతీయ ఒప్పందాలకు లోబడి ముందుకు సాగుతాయని ఆయన తెలిపారు. రక్షణ, భద్రత ఒప్పందాలపై మరింత ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. అణు ఒప్పందంలో అడుగు ముందుకేశామని ఆయన వివరించారు. పౌర అణు ఒప్పందం రెండు దేశాల సంబంధాల్లో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై రెండు దేశాల ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందేందుకు వర్తక, వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో పరస్పర సహకారం అందుతుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్ లో రెండు దేశాల మధ్య సహకారం, సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సమావేశాలు విరివిగా జరుగుతాయని ఆయన తెలిపారు.