: సీఎం విదేశీపర్యటనకు వెళితే, ఆ బాధ్యతలు తనకు అప్పగించాలని కోరినందుకే బర్తరఫ్: రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశాలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో, సీఎం పదవీ బాధ్యతలు డిప్యూటీ సీఎంగా తనకు అప్పగించాలని కోరినందునే తాటికొండ రాజయ్యపై వేటు వేశారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఓ నీతి, దొరలకు మరోనీతి అమలవుతోందని అన్నారు. గతంలో కడియం శ్రీహరికి చెక్ చెప్పేందుకు రాజయ్యను మంత్రిని చేసిన కేసీఆర్, ఇప్పుడు రాజయ్యను తొలగించుకునేందుకు శ్రీహరిని అడ్డుపెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఏ తప్పూ చేయని రాజయ్యను ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. అవినీతికి పాల్పడితే బంధువులను కూడా పట్టించుకోనని చెబుతున్న కేసీఆర్, రామేశ్వరరావు, ప్రవీణ్ రావుల అవినీతిని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. సీఎం కేసీఆర్ రాజకీయ చదరంగంలో దళితులు పావులయ్యారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలను విమర్శించేందుకు దళితులు కావాలి, పదవులు అనుభవించేందుకు మాత్రం వారు పనికి రారా? అని ఆయన మండిపడ్డారు. సీఎం చెబుతున్నట్టు స్వైన్ ఫ్లూపై చర్యలు తీసుకున్నట్టైతే, స్వైన్ ఫ్లూ నివారణలో వైద్య ఆరోగ్య శాఖది ఎంత బాధ్యతో, మున్సిపల్ శాఖది కూడా అంతే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది కనుక ఆయన పదవి నుంచి తప్పుకుంటారా? అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News