: 'పైసలిస్తేనే ప్రసవం'... సంగారెడ్డి ఆసుపత్రిలో అవినీతిని స్వయంగా కనిపెట్టిన మంత్రి హరీశ్ రావు


అవినీతి రాజ్యమేలుతున్న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు, అక్కడ 'పైసలిస్తేనే ప్రసవం' జరుగుతోందని కనిపెట్టి, తీవ్రంగా మండిపడ్డారు. రెండు రోజుల్లో 30 వేల రూపాయలను రోగుల నుంచి వసూలు చేశారని గుర్తించిన ఆయనలో కోపం కట్టలు తెంచుకుంది. కాన్పు కోసం ఆపరేషన్ థియేటర్‌ కు వెళ్లినప్పటి నుంచి బిడ్డపుట్టిన తరువాత బెడ్‌పై వేసే వరకు సిబ్బంది చేయి చాపుతున్నారు. డబ్బులివ్వకపోతే కసురుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఒక్కో కాన్పుకు వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తూ, విషయం బయటకు చెబితే మీకే ఇబ్బందులని బెదిరిస్తున్నట్టు మంత్రి దృష్టికి వచ్చింది. ఆసుపత్రి తనిఖీలో భాగంగా, ప్రసూతీ వార్డులో కలెక్టర్, ఎమ్మెల్యే మినహా అందరినీ బయటకు పంపిన హరీశ్ ఒక్కో మహిళ వద్దకు వెళ్లి మాట్లాడారు. కొడుకు పుట్టాడా?... బిడ్డ పుట్టిందా?, కాన్పు చేసిన వాళ్లకు ఎన్ని డబ్బులిచ్చావమ్మా? అని అడుగుతూ వారినుంచి నిజాన్ని రాబట్టారు. వార్డులో 34 మంది ఉంటే 30 మంది నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించిన హరీశ్‌ రావు ఆగ్రహానికి లోనయ్యారు. డబ్బులు ఎవరు, ఎంతెంత తీసుకున్నారో లెక్కకట్టి ఇవ్వాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ ను మంత్రి ఆదేశించినట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News