: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు 'బాంబే టాకీస్'
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించిన 'బాంబే టాకీస్' చిత్రం 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్' కు ఎంపికయింది. వచ్చేనెల 15 నుంచి 26 వరకు జరగనున్న 66వ కేన్స్ ఉత్సవాల్లో ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తారు. వీటిలో భారతదేశం నుంచి ఈ లఘు చిత్రం కూడా ఉండటం విశేషం. హిందీ దర్శకులు కరణ్ జోహార్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ కలిసి సంయుక్తంగా 20 నిమిషాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నలుగురు ఒక్కో భాగానికి దర్శకత్వం వహించారు. దీనిపై కరణ్ జోహార్ స్పందిస్తూ.. తమ చిత్రాన్ని ఎంపిక చేసి అత్యంత గౌరవంతో సన్మానించారని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మిగతా దర్శకులతో కలిసి కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచేందుకు చాలా ఆతృతగా ఉన్నట్లు తెలిపాడు. మే 3న 'బాంబే టాకీస్' థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.