: ఏపీ ఖజానా ఖాళీ... అన్ని చెల్లింపులూ బంద్!
నవ్యాంధ్ర ఖజానా ఖాళీ అయింది. ఇంకా చెప్పాలంటే, ఈనెల వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం, అదే సమయంలో చెల్లింపులు పెరిగిపోవడంతో ఆర్థికంగా చితికి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలు మినహా మిగిలిన బిల్లులు, ఇతర చెల్లింపులు, వివిధ పథకాలకు విడుదల చేయాల్సిన నిధులు అన్నిటినీ ఆపివేయాలని కఠిన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఒకటో తేదీ వస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.2500 కోట్లు చెల్లించాలి. అందుకు అవసరమైన నిధుల సమీకరణకే ఏపీ ప్రభుత్వం తిప్పలు పడుతోంది. రైతు రుణ మాఫీ పథకం అమలుకు రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి, దానికి రూ.5000 కోట్లను మళ్లించి తప్పు చేశామని ప్రభుత్వం బాధ పడుతోంది. అందువల్లే రుణ మాఫీలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇవ్వాలనుకున్న మొత్తాన్ని ప్రస్తుతానికి నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యాన పంటల రైతులకు ఇవ్వాలని నిర్ణయించిన రూ.3000 కోట్లను ఇప్పట్లో సర్దుబాటు చేయలేమని చేతులెత్తేసింది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహక రూపంలో ఇచ్చే నిధులను, అన్ని రకాల బిల్లులు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లింపులు, నిధులు మంజూరు చేయవద్దని ఆదేశాలు రావడంతో అధికారులు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్లను పూర్తిగా పక్కన పడేశారు.