: ఆ కానిస్టేబుల్ నుంచి కాపాడండి... ఫిర్యాదు చేసిన ఎస్ఐ!
ఓ కానిస్టేబుల్ దాడి చేస్తాడన్న ప్రాణభయంతో సాక్షాత్తు ఎస్సై కుటుంబం బిక్కుబిక్కుమంటోంది. ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పిల్లలను పాఠశాలకు కూడా పంపించకుండా భయంతో గడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ పట్టణంలో గతంలో ఒక కానిస్టేబుల్ తన పైఅధికారితో దురుసుగా ప్రవర్తించిన విషయమై ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐ విచారణ జరిపి నివేదిక ఇవ్వగా, సదరు కానిస్టేబులుపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఎస్సైపై కక్షగట్టిన కానిస్టేబుల్ నిత్యం వేధిస్తున్నాడు. ఇంటిపై రాళ్లు వేయడం, కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటివి చేస్తున్నాడు. యాసిడ్‌తో దాడికి ప్రణాళికలు వేస్తున్నాడని తెలిసి ఎస్ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. రక్షణ కోసం ఇంటి వద్ద బంధువులను కాపాలా పెట్టాల్సి వస్తోందని సన్నిహితుల వద్ద సదరు ఎస్సై వాపోయినట్లు తెలిసింది. తాజాగా ఎస్ఐ మరోసారి ఫిర్యాదు చేయడంతో, కరీంనగర్ త్రీటౌన్ లో కేసు నమోదైంది.