: బీమా డబ్బు కోసం స్నేహితుడిని హతమార్చి రోడ్డు ప్రమాదంలా నమ్మించాడు!
సినిమాల ప్రభావమో లేక ఎక్కువ డబ్బు ఒకేసారి సంపాదించాలన్న ఆలోచనో... ఓ విద్యార్థి తప్పుడుదారిని ఎంచుకున్నాడు. రూ.60 లక్షల బీమా నగదు వస్తుందన్న అత్యాశతో కలిసి చదువుకున్న స్నేహితుడినే హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రించాడు. కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయన్న తల్లిదండ్రుల ఫిర్యాదుతో దాదాపు 15 నెలల తరువాత నిజం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య 2013 సెప్టెంబర్ 29న గిద్దలూరులో జరుగగా, నిజానిజాలను ఒంగోలు ఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా వెన్నపల్లి గ్రామానికి చెందిన కామిశెట్టి మధుసూదనరావు, గిద్దలూరు బందిలదొడ్డి వీధికి చెందిన బోదనబోయిన గురు శ్రీరంగ శ్రీనివాస్ లు కృష్ణా జిల్లా నూజివీడులో చదువుకునే సమయంలో మంచి స్నేహితులు. స్నేహితుని పేరుపై బీమా చేయించి, అనంతరం అతన్ని హతమార్చి ఆ నగదు కాజేయాలని పథకం రచించాడు శ్రీనివాస్. దానిలో భాగంగా విదేశాలకు వెళ్దామని నమ్మించి పెద్ద మొత్తంలో బీమా చేయించి, అసైనీగా తన పేరును నమోదు చేయించుకున్నాడు. మధుసూదనరావును హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే రూ.60 లక్షలు వస్తాయని భావించాడు. మరో నలుగురి సహకారంతో, వేలం వేస్తున్న ఒక వాహనాన్ని కొనుగోలు చేశాడు. గిద్దలూరుకు పిలిపించి ఊరు బయటకు తీసుకెళ్ళి టాటా-207 వాహనంతో గుద్దించాడు. అప్పట్లో రోడ్డు ప్రమాదంగా కేసు నమోదైంది. హెచ్ఆర్సీ కల్పించుకోవడంలో ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విధినిర్వహణలో అలసత్వం చూపి కేసు దర్యాప్తు సక్రమంగా చేయని అధికారులపై చర్యకు రంగం సిద్ధం అయింది.