: మరో ఘరానా మోసాని తెరతీసిన అగ్రిగోల్డ్
అసంబద్ధమైన హామీలతో గతకొంత కాలంగా వివాదం రేపుతున్న అగ్రిగోల్డ్ సంస్థ అనధికార వసూళ్లతో మరో వివాదాని తెరలేపింది. ఖాతాదారుల ఫిర్యాదులతో పోలీసు దాడులు, ఇన్ కమ్ టాక్స్ దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న అగ్రిగోల్డ్ సంస్థపై పలు ఆంక్షలు ఉన్నాయి. 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెబుతున్న అగ్రిగోల్డ్ యాజమాన్యం, ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా పబ్బం గడుపుకుంటోంది. అంతే కాకుండా సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఖాతాదారులను వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులపాలు చేస్తోంది. అలాంటి అగ్రిగోల్డ్ సంస్థ తాజాగా ఖాతాదారులకు కరపత్రాలు పంపిణీ చేసింది. మెయిల్ అడ్రస్ ఉన్న ఖాతాదారులకు మెయిల్ లో వీటిని పంపారు. ఇందులో ఉన్న విషయమేంటంటే, అగ్రిగోల్డ్ నిర్మించతలపెట్టిన వండర్ ల్యాండ్ లో ఫ్లాట్ ల కొనుగోలు కోసం కొన్ని వాయిదాలు చెల్లించిన ఖాతాదారులు, ఇతర వాయిదాలు కూడా చెల్లించాలని ఉంది. ఖాతాదారులకు డబ్బులు చెల్లించకపోవడంతో, ఖాతాదారుల నుంచి ఎలాంటి వసూళ్లకు పాల్పడరాదంటూ పోలీసుల ఆంక్షలు అమలవుతుండగా, ఈ కొత్త వసూళ్లకు అగ్రిగోల్డ్ తెరలేపడం విశేషం. అగ్రిగోల్డ్ పంపిన మెయిల్స్ లో కానీ, కరపత్రాల్లో కానీ సంస్థ పేరు కానీ, సంస్థ ప్రతినిధుల సంతకాలు కానీ లేకపోవడం విశేషం. దీనిపై ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, దీనిపై సంస్థ ప్రతినిధులు స్పందించకపోవడం విశేషం.