: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్...రెండు గంటల ఛేజింగ్
సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్ యత్నం జరిగింది. రెండు గంటల ఛేజింగ్ అనంతరం పోలీసులు యువతిని రక్షించి, నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాదు శివారు కొంపల్లి సమీపంలోని ఉమామహేశ్వరం కాలనీలోని ఇంట్లో ఓ యువతి (19) టైలరింగ్ చేస్తుండగా, ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించి ఆమెను బలవంతంగా ఇండికా కారులో ఎక్కించుకున్నారు. దీంతో ఆమె రక్షించాలంటూ కేకలు వేసింది. దీనిని విన్న స్థానికులు రవీందర్, ప్రవీణ్, శ్రీను అనే యువకులు కారును వెంబడించారు. కొంపల్లి సినీ ప్లానెట్ వరకు వెళ్లిన కారు, దూలపల్లి మీదుగా దారి మళ్లింది. మల్లారెడ్డి కళాశాల వద్ద పేట్ బషీరాబాద్ పెట్రొల్ మొబైల్ పోలీసులు ఎదురు కావడంతో విషయాన్ని యువకులు వారికి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించారు. ఆ రూట్లోని పోలీసుల్ని కూడా అప్రమత్తం చేశారు. నర్సాపూర్ సీఐ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, దానిని ఢీకొని కారు వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వెంబడిస్తున్న విషయం కిడ్నాపర్లకు తెలిసింది. ఇంతలో యువతిని తీసుకుని కారుదిగి, షేరింగ్ ఆటో ఎక్కి పోలీసుల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశారు. కారును వదలకుండా ఫాలో అయిన పోలీసులు మధ్యలో వారిని అదుపులోకి తీసుకుని వారి ద్వారా యువతిని పట్టుకున్నారు. కాగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కిడ్నాపైన యువతికి ప్రధాన నిందితుడితో వివాహం చేద్దామని పెద్దలు నిశ్చయించారు. ఇంతలో అతను తాగుబోతు అని తెలియడంతో వివాహం రద్దు చేశారు. దీంతో అతను తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. సకాలంలో పోలీసులు స్పందించడంతో దుండగుల ఆటకట్టింది.