: ఓవర్ లోడే కారణమా... ఎయిర్ టెల్ సేవల అంతరాయంపై ఊహాగానాలు!
హైదరాబాదుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నేటి ఉదయం 6 గంటల నుంచి ఎయిర్ టెల్ సేవల్లో అంతరాయం నెలకొంది. దీంతో ఎయిర్ టెల్ సెల్ ఫోన్లు మూగబోయాయి. సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు బేగంపేటలోని ఎయిర్ టెల్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గంటలోగా సేవలను పునరుద్ధరిస్తామని చెబుతూ వస్తున్న ఎయిర్ టెల్ ఉన్నతాధికారులు, సేవల అంతరాయానికి గల కారణాలపై మాత్రం నోరు మెదపడం లేదు. పరిమితికి మించి కనెక్షన్లు ఇచ్చిన నేపథ్యంలోనే ఎయిర్ టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని కొందరు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎయిర్ టెల్ ను నియంత్రించడంలో ట్రాయ్ కూడా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.