: హైదరాబాదులో కంపించిన భూమి... పరుగులు పెట్టిన ప్రజలు
హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని రాజేంద్ర నగర్, అత్తాపూర్, హైదర్ గూడ, కాళీ మందిర్, కిస్మత్ పుర, బుద్వేల్, బఢహదూర్ పుర, కాటేదాన్, పద్మశాలీపురం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటే భూమి కంపించినప్పటికీ భయంతో బెంబేలెత్తిన జనం ఇళ్లల్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. రోడ్లపైనే అర్ధరాత్రి దాటేదాకా జాగారం చేశారు. రాత్రి 10.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రకంపనలకు సంబంధించిన సమాచారం, క్షణాల్లో నగరంలో వ్యాపించింది. క్వారీ పేలుళ్ల కారణంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని భావించిన ప్రజలు, ఆ తర్వాత స్వల్ప భూకంపం చోటుచేసుకుందన్న సమాచారంతో భయాందోళనలకు గురయ్యారు. ఈ భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.8గా నమోదైందని భూ భౌతిక పరిశోధన సంస్థకు చెందిన అధికారులు చెబుతున్నారు.