: తన బైక్ వెనక కూర్చోమని సైగలు చేస్తూ 'షీ' టీమ్ కు చిక్కిన ప్రిన్సిపాల్
అతను బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. బాచుపల్లిలోని గాయత్రి జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా కూడా పనిచేస్తున్నాడు. రోడ్లపై వెకిలి చేష్టలు చేస్తూ 'షీ' టీమ్ నిఘా కెమెరా కంటికి చిక్కి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. హైదర్ నగర్‌కు చెందిన ఎం.ధన్ శెట్టి (38) బస్ స్టాప్ లలో ఒంటరిగా కనిపించిన మహిళలను చూస్తూ తన బైక్‌పై కూర్చోవాలంటూ సైగలు చేస్తుంటాడు. నేటి ఉదయం లక్డీకపూల్ బస్టాండులో మహిళలను చూస్తూ, అలవాటుగా తన బైక్ పై కూర్చోమని సైగ చేస్తూ, పక్కనే ఉన్న 'షీ' టీమ్ కంట్లో పడ్డాడు. అతడి ప్రవర్తనను చిత్రీకరించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న 'షీ' టీమ్ సభ్యులు కేసు నమోదు చేశారు. మరో రెండు కేసులలో నలుగురు విద్యార్థులు అమ్మాయిలను ఏడిపిస్తూ పట్టుబడ్డారని అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్ అండ్ సిట్) స్వాతీ లక్రా తెలిపారు.