: నీ ప్రేమాయణం పేపర్లో వేయిస్తా... ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ కు బెదిరింపులు
ఇంగ్లాండ్ వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమితుడైన ఇయాన్ మోర్గాన్ బ్లాక్ మెయిలింగ్ కు గురయ్యాడట. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపిందీ విషయాన్ని. వివరాల్లోకెళితే... మోర్గాన్ ఐదేళ్ల క్రితం ఓ ఆస్ట్రేలియా జాతీయురాలితో ప్రేమాయణం నడిపాడు. ఆ వ్యవహారాన్ని ఆస్ట్రేలియా, బ్రిటన్ వార్తా పత్రికలకు ఎక్కిస్తానంటూ ఓ ఆస్ట్రేలియా జాతీయుడు తాజాగా మోర్గాన్ ను బెదిరించాడట. భారీ మొత్తం ముట్టచెప్పకపోతే నీ ప్రేమాయణం పేపర్లో చూసుకోవాల్సి ఉంటుందని మోర్గాన్ ను బ్లాక్ మెయిల్ చేయసాగాడట. ఈ విషయాన్ని మోర్గాన్ ఈసీబీకి తెలిపాడు. దీంతో, రంగంలోకి దిగిన ఈసీబీ ఆస్ట్రేలియా పోలీసులతో కలిసి విషయంపై ఆరా తీసింది. సదరు వ్యక్తిని ప్రశ్నించగా, అసూయతోనే బెదరింపులకు పాల్పడినట్టు అంగీకరించాడట. తన చర్యలకు క్షమాపణ చెప్పాడట. కాగా, ఈ ఆస్ట్రేలియన్ జాతీయుడు కూడా మోర్గాన్ మాజీ ప్రియురాలితో సంబంధాలున్న వ్యక్తయి ఉంటాడని, అందుకే ఇలా వ్యవహరించి ఉంటాడని భావిస్తున్నారు. కాగా, అతనిపై చర్యలకు తాము పట్టుబట్టడంలేదని ఈసీబీ పేర్కొంది. "మా జట్టు వరల్డ్ కప్ సన్నాహాలకు అడ్డుతగిలేందుకు ఎవరినీ అనుమతించబోం. ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిందని భావిస్తున్నాం" అని ఈసీబీ మేనేజింగ్ డైరక్టర్ పాల్ డౌన్టన్ తెలిపారు.