: ఓ రామ నీ నామమెంతో రుచిరా..


నీలమేఘ శ్యాముడు.. సకల జన భోజుడు.. జానకీ మానస చోరుడు.. పురుషోత్తముడు ... లోకైక వీరుడు.. నిఖిలలోక ఆదర్శప్రాయుడు! ఇన్ని విశేషణాలున్న పురాణ పురుషుడు తప్పకుండా రాముడే అవుతాడు. అది భక్తుల నమ్మకం. త్రేతాయుగం నుంచి రాముడిపై లోక జనుల విశ్వాసం పెరుగుతోందే కాని సడలడంలేదు. ఎందుకంటే, ఏ విషయంలో తీసుకున్నా మనం రాముడినే ఆదర్శంగా తీసుకుంటాం.

పితృ వాక్య పరిపాలకుడిగా, అవనిజ భర్తగా, చెప్పిన మాట జవదాటని లక్ష్మణాదులకు సోదరుడిగా, పాహిమాం అన్న ఆర్తులకు ఆపన్న హస్తం అందించే కరుణ రస హృదయుడిగా, గృహస్థ ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన వ్యక్తిగా.. రాముడు.. ఎలా చూసినా మార్గదర్శకుడే. ఓ పరిపాలకుడి అవతారంలో భగవంతుడు అవతరించిడం రాముడితోనే మొదలు.. రాముడితోనే ఆఖరు.

సుపరిపాలనకు సిసలైన నిర్వచనంలా భాసిల్లిన రామయతండ్రి నేడు వసుంధరా పుత్రిక సీతా దేవితో తన కల్యాణం కమనీయంగా జరిపించుకుంటున్నాడు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్రమంతా రామనామ స్మరణతో హోరెత్తిపోతోంది. ఓ రామ నీ నామమెంతో రుచిరా... అంటూ ఆశేష భక్తకోటి తమ ఆరాధ్యదైవాన్నిమనసారా స్మరిస్తున్నారు.

ఖమ్మం జిల్లా భద్రాద్రి, కరీంనగర్ జిల్లా వేములవాడ, విజయనగరం జిల్లా రామతీర్థం,రాష్ట్రంలో ఏ రామమందిరం చూసినా కోదండపాణి కల్యాణ వేడుకలే. అసలు చెప్పుకోవాల్సి వస్తే, హైందవ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి గుండెల్లోనూ నేడు సీతారాముని పెళ్ళి బాజాలే మోగుతుంటాయి.

  • Loading...

More Telugu News