: కాంగ్రెస్ సోదిలోనే లేదు... ఢిల్లీ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీనే మా ప్రత్యర్థి: అమిత్ షా
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతోనే తమకు ప్రధాన పోటీ ఉంటుందన్న ఆయన, కాంగ్రెస్ పార్టీని అసలు పోటీలో ఉన్నట్లుగానే పరిగణించడం లేదని వ్యాఖ్యానించారు. తూర్పు ఢిల్లీలో పార్టీ బూత్ ఇంచార్జీలతో భేటీ సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘యావత్తు దేశమే కాక ప్రపంచం కూడా ఢిల్లీ ఎన్నికలపై ఆసక్తిగా దృష్టి సారించింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే మిగిలిన ప్రాంతాల్లోనూ మనకు తిరుగుండదు. ఒక్కసారి ఢిల్లీలో గెలిస్తే... కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అతాక్ నుంచి కటక్ దాకా మనలను ఆపే వారే ఉండరు’’ అని ఆయన ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. మనం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే తలపడుతున్నాం. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపను తాకండి. ఆప్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను ప్రతి వ్యక్తికీ తెలపండి. షీలా దీక్షిత్ పై చర్య తీసుకున్నామని చెబుతున్న ఆప్, ఆ తర్వాత మరో అడుగు ముందుకేయలేకపోయింది. ఎందుకంటే, ఆ పార్టీ, కాంగ్రెస్ మద్దతు తీసుకుంది’’ అని షా, పార్టీ శ్రేణులకు ప్రచార సరళిపై దిశానిర్దేశం చేశారు.