: నేనెప్పుడు బీజేపీలో చేరాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారు: మలయాళ స్టార్ సురేశ్ గోపి


దేశంలో పలు పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బీజేపీ బాట పడుతున్నారు. తాజాగా, మలయాళ సూపర్ స్టార్ సురేశ్ గోపి కూడా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ త్వరలో బీజేపీలో చేరనున్నానని తెలిపాడు. అయితే, తానెప్పుడు పార్టీలో చేరాలనేది ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని చెప్పాడు. బహుశా, రిపబ్లిక్ డే తర్వాత పార్టీలో చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు, కేరళ బీజేపీ అధ్యక్షుడు వి.మురళీధరన్ ఈ నటుడిని పార్టీలోకి ఆహ్వానించారు. మురళీధరన్ మాట్లాడుతూ... మూణ్నెల్ల క్రితమే తాము సురేశ్ గోపీని పార్టీలోకి తీసుకునే విషయమై చర్చించామన్నారు. పార్టీలో ఎప్పుడు చేరాలనేది అతనే నిర్ణయించుకోవాలని మురళీధరన్ పేర్కొన్నారు. బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, మోదీ క్యాబినెట్లో పదవి చేపట్టాలని ఉందని గతంలో సురేశ్ గోపి పేర్కొన్నాడు. ఇటీవలే సురేశ్ గోపి, కేరళలో ప్రతిపాదిత విళింజం పోర్టు వాస్తవ రూపం దాల్చేందుకు హిందువులు ముందుకు రావాలని పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. 'సిటీ పోలీస్', 'పోలీస్ కమిషనర్' తదితర చిత్రాల ద్వారా సురేశ్ గోపి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.

  • Loading...

More Telugu News